Tuesday, March 15, 2011

Chakram (2005) - 2

పాట - 1
పల్లవి :

ఒకే ఒక మాటా మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాటా పెదవోపలేనంత తీయంగా

నాపేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ

నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ

నీకు చెప్పాలని

ఒకే ఒక మాటా మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాటా పెదవోపలేనంత తీయంగా

చరణం : 1

నేను అనీ లేను అనీ చెబితే ఏం చేస్తావూ

నమ్మననీ నవ్వుకొనీ చాల్లె పొమ్మంటావూ

నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ

నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ

నీకంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ

తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ

నీకు చెప్పాలని

ఒకే ఒక మాటా మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాటా పెదవోపలేనంత తీయంగా

చరణం : 2

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం

నిను విడిచీ బతకడమే మరణమన్నది ప్రాణం

నువు రాక ముందు జీవితం గురుతైన లేదనీ

నిను కలుసుకున్న ఆ క్షణం నను వ దలి పోదనీ

ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ

ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ

నీకు చెప్పాలని

ఒకే ఒక మాటా మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాటా పెదవోపలేనంత తీయంగా

నాపేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ

నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ

నీకు చెప్పాలని

ఒకే ఒక మాటా మదిలోన దాగుంది మౌనంగా

ఒకే ఒక మాటా పెదవోపలేనంత తీయంగా


చిత్రం : చక్రం (2005)

రచన : సిరివెన్నెల

సంగీతం, గానం : చక్రి

----

పాట - 2

పల్లవి :

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

సంసార సాగరం నాదే... సన్యాసం శూన్యం నావే

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

చరణం : 1

కవినై... కవితనై... భార్యనై... భర్తనై...

కవినై... కవితనై... భార్యనై... భర్తనై...

మల్లెల దారిలో... మంచు ఎడారిలో

మల్లెల దారిలో... మంచు ఎడారిలో

పన్నీటి జయగీతాల... కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిసూ.్త.. నాతో నేనే ర మిస్తూ

ఒంటరినై అనవరతం.. కంటున్నాను నిరంతరం

కలల్ని... కథల్ని... మాటల్ని... పాటల్ని... రంగుల్ని...

రంగవల్లుల్ని... కావ్య కన్యల్ని... ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

చరణం : 2

మింటికి కంటిని నేనై... కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై... కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై

వెన్నెల పూతల మంటను నేనై

రవినై... శశినై... దివమై... నిశినై...

నాతో నేను సహగమిస్తూ... నాతో నేనే రమిస్తూ

ఒంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల... హరిణాల్ని హరిణాల... చరణాల్ని చరణాల

చలనాన కనరాని గమ్యాల కాలాన్ని... ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

చరణం : 3

గాలిపల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతువాకిలిని మూసి మరలి

తను మూగవోయి నా గుండె మిగిలె

నా హృదయమే నా లోగిలి

నా హృదయమే నా పాటకి తల్లి

నా హృదయమే... నాకు ఆలి

నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది


చిత్రం : చక్రం (2005)

రచన : సిరివెన్నెల

సంగీతం : చక్రి

గానం : శ్రీ

No comments:

Post a Comment